కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పలు అవినీతి, పరిపాలనా లోపాలను గుర్తించారు. అనధికార నిర్మాణాలు, ట్రేడ్ లైసెన్సులు, పన్నుల అంచనాల్లో లోపాలు, ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ రేంజ్‌కు చెందిన ఏసీబీ బృందం మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను, ఆర్థిక లావాదేవీలను, పెండింగ్ దరఖాస్తులను, కార్యాలయ పనితీరును సమగ్రంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో మున్సిపల్ పరిపాలనలో అనేక లోపాలు బయటపడ్డాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
అనధికార నిర్మాణాలకు సంబంధించి 47 ఫిర్యాదులు వచ్చినా, నిర్ణీత గడువు ముగిసినా తదుపరి చర్యలు తీసుకోలేదని గుర్తించారు. అలాగే 400కు పైగా కమర్షియల్ దుకాణాల ట్రేడ్ లైసెన్సులు రెన్యూవల్ చేయకుండానే కొనసాగుతున్నాయని, దీనివల్ల సుమారు రూ.1 కోటి ఆదాయం ప్రభుత్వానికి రావాల్సి ఉందని వెల్లడైంది. ప్రాపర్టీ పన్ను అంచనాల్లో తేడాల వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయ నష్టం జరిగిందని పేర్కొన్నారు.
మున్సిపల్ అధికారుల వాహనాల ఇంధన ఖర్చులకు ప్రతి నెలా రూ.12.40 లక్షలు కేటాయిస్తున్నా, సరైన రికార్డులు లేవని గుర్తించారు. కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గైర్హాజరైనా, పూర్తి నెల జీతాలు పొందినట్లు రికార్డుల్లో చూపిన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. బిల్డింగ్ అనుమతి దరఖాస్తుల పరిశీలనలో కూడా ఆలస్యం జరుగుతోందని, 169 దరఖాస్తులలో 18 దరఖాస్తులు నిర్ణీత గడువును మించి పెండింగ్‌లో ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ అంశాలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతిపై సమాచారం అందించడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సూచించారు.











