కామారెడ్డిలోని పి.ఎం.హెచ్.బి కేంద్రంలో దాల్ కుక్కర్ పేలి గాయపడిన కార్మికురాలు కల్పనకు అత్యున్నత వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
శనివారం మధ్యాహ్నం పి.ఎం.హెచ్.బి కేంద్రంలో కందిపప్పు వండుతుండగా దాల్ కుక్కర్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో కల్పన అనే కార్మికురాలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు.
కలెక్టర్ కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ప్రస్తుతం కల్పన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఆమెను వెంటనే హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, వంట గదుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ సూచించారు.








