ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటించిన కొత్త పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన'పై టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కవిత రాజకీయ ప్రవేశాన్ని అభినందిస్తూనే, గత బీఆర్ఎస్ పాలనపై ఆమెను నిలదీశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, దోపిడీలో కవితకు కూడా వాటా ఉందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. "రాష్ట్రాన్ని దోచుకుంటుంటే కవిత మౌనంగా ఉన్నారు. ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నారు కానీ, తన పాత్ర ఏమిటో ప్రజలకు వివరించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, "అదే పార్టీలో పదేళ్లు ఉన్న కవితకు అప్పుడు తెలియదా? అధికారం పోయాక, ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఆశ ఉండాలి కానీ, అత్యాశ పనికిరాదు" అని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత చేస్తున్న విమర్శలను మహేశ్ గౌడ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కొత్త పార్టీల వల్ల కాంగ్రెస్కు నష్టం లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.







