కామారెడ్డి జిల్లాలో అక్రిడేషన్ కమిటీ సభ్యుల నియామకంపై జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అర్హత ప్రమాణాలను పాటించలేదని పలువురు జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో అక్రిడేషన్ కమిటీ సభ్యుల ఎంపికపై వివాదం రాజుకుంది. పెద్ద, మధ్య తరహా పత్రికలు, ఫోటోగ్రాఫర్ల ఎంపికలో అనుసరించిన ప్రమాణాలపై స్పష్టత లేదని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పత్రికల ప్రామాణికత, సర్క్యులేషన్, జర్నలిస్టుల అనుభవం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే నియామకాలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి.
కమిటీలో సభ్యులుగా ఉన్న కొందరు వ్యక్తులు వాస్తవ జర్నలిస్టులేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరు ఎక్కడా ప్రెస్ మీటింగ్లలో కనిపించలేదని, వీరి వార్తలు కూడా ఎక్కడా ప్రచురితం కాలేదని జర్నలిస్టులు పేర్కొంటున్నారు. పని చేస్తున్న జర్నలిస్టులను గుర్తించలేని స్థితిలో ఉన్నవారిని కమిటీలో నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తరఫున అక్రిడేషన్ కమిటీ సభ్యుల నియామకానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయా లేదా అనే విషయంలో కూడా సందేహాలు నెలకొన్నాయి. ఎవరికో అనుకూలంగా, రహస్యంగా నియామకాలు జరిగితే, నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే యూనియన్ ప్రభావంతో తమకు అనుకూలమైన వ్యక్తులను మాత్రమే ఎంపిక చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
అక్రిడేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే, ఇప్పటికైనా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి (DPRO) పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించి, సీనియర్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.











