ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం 111 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, విద్యుత్, భూ సమస్యలు, మహిళా సమైక్య భవనం ఏర్పాటు వంటి వివిధ రకాల దరఖాస్తులు వివిధ మండలాల నుండి వచ్చాయి. రాజాంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన బంటు శ్యామయ్య తన రేకుల షెడ్డు, బర్రెల కొట్టం నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం కోరారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తహసీల్దార్ లు ఆయా మండలాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన సూచించారు.
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్.వి. గిరి, సీఈఓ చందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.












