తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో కామారెడ్డి అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భత్తుల నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అయితే ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరాల్సి ఉందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భత్తుల నారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.
"మన రాష్ట్రం మనది, మన నిధులు మనవి, మన కొలువులు మనవి" అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణను గర్వంగా జరుపుకోవడం సంతోషకరమని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాల వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడే స్వరాష్ట్ర లక్ష్యాలు సాకారమవుతాయని, అదే అమరవీరులకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సుమలత, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్యప్రసాద్, ప్రభుత్వ న్యాయవాది శ్యాంగోపాల్రావు, అదనపు ప్రభుత్వ న్యాయవాది రజనీకాంత్, ఏజీపీ షబానా బేగం, న్యాయవాదులు జగన్నాథం, మాయ సురేష్, గజ్జల భిక్షపతి, వెంకటరామిరెడ్డి, మువ్వ శ్రీనివాస్, విట్టల్రావు, సంగీత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












