ఓటర్ల జాబితాలో లోపాలపై రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఓటర్ల జాబితాలో లోపాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి ఓటు ఒకే ప్రాంతంలో నమోదు కావాలని, ప్రింటింగ్ లోపాల వల్ల కొందరి ఓట్లు పలు చోట్ల నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఓటర్ల జాబితాను సరిదిద్దడంలో అందరి బాధ్యత ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తాము తప్పుపట్టడం లేదని, అయితే ఓటర్ల జాబితాలో లోపాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నమ్మకం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముస్లింల సమావేశంలో పాల్గొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారని, బీజేపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
కేరళ, తమిళనాడులో బీజేపీ గెలవలేదనే కారణంతో అక్కడ ఎన్నికలు సక్రమంగా జరిగాయని, పశ్చిమబెంగాల్లో బీజేపీ గెలిచిందని అక్కడ ఎన్నికలు తప్పుగా జరిగాయని అనడం విడ్డూరంగా ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించాలని, ఎన్నికల సంఘంపై బురద జల్లడం మానుకోవాలని సూచించారు.











