బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక యువతిని దారుణంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి ఇనుప పెట్టెలో దాచిన ఘటన లఖ్‌నవూ రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
లఖ్‌నవూ స్టేషన్‌కు చేరుకున్న ఛప్రా-గోరఖ్‌పూర్-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ రైలులో 'ఎస్-1' స్లీపర్ కోచ్‌లో రైల్వే సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద ఇనుప పెట్టె, సంచి కనిపించాయి. స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఫోరెన్సిక్ బృందం సమక్షంలో పెట్టెను తెరవగా, అందులో ఒక యువతి మొండెం, మరో సంచిలో చేతులు, కాళ్లు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నాయి. మృతదేహానికి సంబంధించిన తల లభించలేదు. మృతురాలి వయసు సుమారు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా.
దుండగులు హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా శరీర భాగాలను ముక్కలుగా నరికి రైలులో వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నేరస్థులను పట్టుకునేందుకు ఛప్రా, గోరఖ్‌పూర్, లఖ్‌నవూ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.










