రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గంజాయి నివారణ చర్యలలో భాగంగా, రామగుండం కమిషనరేట్ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ ఆకుల అశోక్ నేతృత్వంలో నార్కోటిక్ డాగ్ సహాయంతో ఈ తనిఖీలు జరిగాయి.
శ్రీరాంపూర్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు, దుకాణాలు, పాన్ షాపులు, వైన్ షాపులు, ఖాళీ స్థలాలు, ప్లే గ్రౌండ్స్‌తో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
తనిఖీలలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా ఉంచారు. గంజాయి వినియోగం, అమ్మకాలపై దృష్టి సారించారు.
ప్రజలు కూడా మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.










