తమిళనాడులో సంచలనం రేపిన తండ్రీ కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దేశ న్యాయ చరిత్రలో లాకప్ డెత్ కేసులో ఇంత మంది పోలీసులకు ఒకేసారి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్‌కులం పోలీసులు, మొబైల్ దుకాణం నడుపుతున్న జయరాజ్, బెన్నిక్స్ తండ్రీ కుమారులను లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా హింసించడంతో, జూన్ 22-23 తేదీల్లో ఇద్దరూ మరణించారు. పోలీసుల క్రూరత్వానికి బలైన వీరి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. పోలీసు అధికారులపై హత్యాయత్నం మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సాక్ష్యాల ధ్వంసాన్ని అడ్డుకోవడానికి, పారదర్శక విచారణ కోసం కేసును మొదట సీఐడీకి, ఆ తరువాత సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తులో, పోలీసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని తేలింది.
కేసు విచారణలో ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. పోలీసులు రాత్రంతా తండ్రీ కుమారులను కొడుతూనే ఉన్నారని, లాఠీలపై, బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐకి వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్‌లను ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ ఆధారాలన్నింటితో సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
సుదీర్ఘ విచారణ అనంతరం మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి.ముత్తుకుమార్ తీర్పు వెలువరించారు. జయరాజ్, బెన్నిక్స్ శరీరాలపై ఉన్న గాయాలు 'అసాధారణమైనవి' అని, అవి పోలీసుల నిరంతర, పదే పదే చేసిన దాడి వల్లే సంభవించాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జయరాజ్ గతంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడినప్పటికీ, ఆయన మరణానికి ఆ అనారోగ్యం కారణం కాదని, పోలీసుల చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై అభియోగాలు నమోదు కాగా, ఒకరు విచారణలో ఉండగా మరణించారు. మిగిలిన తొమ్మిది మందికి మరణశిక్ష విధించారు.











