తెలంగాణలోని మహబూబాబాద్‌లో ప్రతిపాదిత మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినతిపత్రం సమర్పించారు. సుమారు 908.15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలోని ఎంపీల బృందం, రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి ఈ వినతిని అందించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమలుకు సిద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్టు, భారతీయ రైల్వేకు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉందని వారు పేర్కొన్నారు.
ఈ డిపోలో ఫ్రైట్ రోలింగ్ స్టాక్ కోసం పీరియాడిక్ ఓవర్‌హాలింగ్, రెగ్యులర్ ఓవర్‌హాలింగ్, సిక్ లైన్ రైలు తనిఖీ వంటి సౌకర్యాలు ఉంటాయని ఎంపీలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాలోని అనంతారంలో 409.01 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడానికి ఇప్పటికే చర్యలు చేపట్టిందని, ఈ స్థలం అవసరమైన భారీ మౌలిక సదుపాయాలకు అనువుగా ఉందని వివరించారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025 నాటికి భూమి కేటాయింపును తెలియజేసినప్పటికీ, ప్రాజెక్టు క్షేత్రస్థాయి అమలులో జాప్యం జరుగుతోందని ఎంపీ వద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడం ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఉంటుందని, ఇది సరుకు రవాణాకు ఎంతో ప్రయోజనకరమని ఎంపీలు అన్నారు.
ప్రాజెక్టులో జాప్యం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోతున్నాయని వారు వాపోయారు. పెండింగ్‌లో ఉన్న పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేయాలని, క్షేత్రస్థాయి పనులను తక్షణమే ప్రారంభించేలా రైల్వే బోర్డును, సంబంధిత అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు.











