తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ నుంచి వీరి జీతాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులో నెలకొన్న జాప్యాన్ని, మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా జీతాలు అందడం వల్ల కమీషన్లు పోవడంతో పాటు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగేది.
కొత్త విధానం ప్రకారం, మున్సిపాలిటీలు, గురుకులాలు, విద్యా, ఆరోగ్య, మైనార్టీ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. దీనివల్ల చెల్లింపుల్లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు అమలులో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (IFMS) విధానాన్నే కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా వర్తింపజేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా, ఉద్యోగుల ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసే పనిని అధికారులు పూర్తి చేశారు.
ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, టెక్నికల్ వర్కర్లు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ మార్పుతో తొలగిపోనున్నాయి. పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీన జీతం అందే అవకాశం ఏర్పడింది.











