తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన దుర్మార్గమైన పరిపాలనపై ఆయన ధ్వజమెత్తారు. కేటీఆర్ పాదయాత్ర చేయాలనుకుంటున్నారని, అయితే అది పాదయాత్ర కాదని, రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను క్షమించరని హెచ్చరించారు.
కేటీఆర్ తన పాదయాత్రను ప్రారంభించే ముందు, తన సోదరి కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహేశ్ గౌడ్ సవాల్ విసిరారు. గత పదేళ్ల కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క లెక్కలతో ప్రశ్నిస్తున్నారని, అయితే కేసీఆర్ అండ్ కో అందుకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల ఆనందం వెనుక ఉన్న దోపిడీని, తమ సోదరి కవిత చెబుతోందని సెటైర్లు వేశారు.
పదేళ్లు దోపిడీకి అలవాటు పడి, అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారని విమర్శించారు. కేటీఆర్ అండ్ కో పిచ్చి మాటలు మాట్లాడుతూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే నేడు తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ అడ్డుకుందని తెలిపారు.
మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీ బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా నిలిచిందని, ఈ గడ్డ నుంచే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు.
భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయిందని ఉద్ఘాటించారు. ఖమ్మం గడ్డపై నిలబడి చెబుతున్నా, వచ్చే ఎన్నికల్లోనే కాకుండా ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చేతనైతే తమ విజయాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.











