తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి ప్రజలను బంట్రోతులుగా చూస్తున్నారని, 'బంట్రోతు పోస్ట్ దొరకదు' అనే ఆయన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టిన టీడీపీని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉపరాష్ట్రపతులుగా సేవలందించారని, వెంకయ్య నాయుడు వంటివారు అందుకు నిదర్శనమని తెలిపారు. తనను తాను మేధావిగా భావించుకుని, అద్దాల మేడలో కూర్చుని ఇతరులపై విమర్శలు చేయడం సరికాదని ముఖ్యమంత్రిని ఉద్దేశించి కిషన్ రెడ్డి అన్నారు.
ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్కడి నుంచి వచ్చారని, దేశం మొత్తం ఒకటే కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లక్ష్మణ్ వలస వెళ్లారని అంటున్నారని, మరి కాంగ్రెస్ నాయకుల సంగతేంటని నిలదీశారు. రాహుల్ గాంధీ బుద్ధితో కాంగ్రెస్ ను నడిపిస్తే, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు కోశాధికారిగా పనిచేస్తున్నారని సెటైర్లు వేశారు.
డీలిమిటేషన్తో ఎన్ని సీట్లు పెరుగుతాయనేది పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టమవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి హైబ్రిడ్, జీడీపీ పరంగా సీట్లు పెరగాలని అనడం ప్రపంచంలో ఎక్కడా లేని విధానమని విమర్శించారు. అలాంటప్పుడు అసెంబ్లీ సీట్లు ఆదిలాబాద్, ఖమ్మంలో తగ్గించి, హైదరాబాద్ లో మాత్రమే పెంచుతారా అని ఆయన ప్రశ్నించారు. 70 శాతం రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తోందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి తప్పుడు మాటలు కాకుండా వాస్తవాలు మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధమని, ఆయన వితండవాదాలు పక్కన పెట్టాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.











