తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తన పాదయాత్ర ప్రారంభించే ముందు, తన సోదరి కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను 'దుర్మార్గమైన పరిపాలన'గా అభివర్ణించారు. కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రను ప్రజలు అంగీకరించరని, రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను క్షమించరని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి ఫాంహౌస్‌లలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏం సాధించారని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క లెక్కలతో ప్రశ్నిస్తున్నారని, అందుకు కేసీఆర్ అండ్ కో సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల ఆనందానికి, దోపిడీకి సంబంధం ఉందని, తమ సోదరి కవిత చెబుతోందని సెటైర్లు వేశారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీ బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని, ఖమ్మం జిల్లా ఎప్పుడూ కాంగ్రెస్‌కు అండగా నిలిచిందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయ్యారని, ఇది కాంగ్రెస్‌కే సాధ్యమని తెలిపారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన, కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే కాంగ్రెస్ అడ్డుకుందని, రాహుల్ గాంధీ పోరాట ఫలితంగా కులగణన జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.











