రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోందని కూకట్పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. పేదల జోలికి వస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నిత్యం కూల్చివేతలు చేపడుతోందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసి, వారి జీవనోపాధికి భరోసా కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు.
రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, కష్టపడి పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని, వారిని రోడ్డు పాలు చేయడం సరికాదని కృష్ణారావు అన్నారు. మునిసిపల్, ట్రాఫిక్ అధికారులు కొందరితో లాలూచీ పడుతూ, పేదలపై కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
పెద్ద వ్యాపార సంస్థలు రోడ్లను, ఖాళీ స్థలాలను పార్కింగ్ కోసం వాడుకుంటున్నా వారిపై చర్యలు తీసుకోకపోవడం పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కెపిహెచ్బి పరిసరాల్లో చిరువ్యాపారులను తొలగించడంతో, బాధితులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
అధికారులకు సూచనలు జారీ చేసిన ఎమ్మెల్యే, చిరు వ్యాపారుల జీవనోపాధికి ఆటంకం కలిగించవద్దని, వారికి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.











