మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని, ఈ నెల 25న నిర్వహించనున్న ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా సమాజంలో విస్తృత అవగాహన అవసరమని ఆయన పేర్కొన్నారు.
జూన్ 25న ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం నుంచి కళాభారతి వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ర్యాలీ ద్వారా మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.











