ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది అని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు అందులో నమోదు కావడం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026 కార్యక్రమంపై ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు అని, ఓటరు జాబితాను సంపూర్ణంగా, పారదర్శకంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురితమవుతుందని, అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ కోరారు.











