పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నొక్కి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయ భవనాన్ని వారు సోమవారం ప్రారంభించారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో “అమృతవనం”, “హరితవనం” పేర్లతో రెండు ఆధునిక ఎకో పార్కులను అభివృద్ధి చేశామని, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. పర్యాటకుల స్పందన ఆధారంగా ‘నైట్ స్టే’ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రిజర్వ్ ఫారెస్టుల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సురేఖ పేర్కొన్నారు. త్వరలోనే నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన భవిష్యత్ అందించగలమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వన మహోత్సవాల ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ప్రకృతి వనాలను అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వద్ద ఏర్పాటు చేసిన అమృతవనం, హరితవనం వంటి ఎకో పార్కులు ప్రజలకు ప్రకృతి సౌందర్యాన్ని చేరువ చేయడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ శాసన సభ్యులు డా.సంజీవరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీశాఖ అధికారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.












