మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయం-1లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షా కేంద్రానికి చేరుకున్న అదనపు కలెక్టర్, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ విధానంపై కళాశాల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మెడికల్ కిట్ సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అదనపు కలెక్టర్ ధ్రువీకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి తహసీల్దార్ నరసింహారెడ్డి, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











