రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, అభివృద్ధిలో కీలక బాధ్యతలు అప్పగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి సెలవులు ముగిసి, జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో, గ్రామాల్లో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంపై సర్పంచులకు అవగాహన కల్పించడానికి విద్యాశాఖ ప్రత్యేక వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో విద్యాశాఖ అధికారులు ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందుకున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలల నిర్వహణలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లా స్థాయిల్లో నిర్వహించబడే ఈ వర్క్‌షాప్‌లలో, ప్రభుత్వ విద్యా పథకాలపై సర్పంచులకు సమగ్ర అవగాహన కల్పించబడుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, కమిటీల పనితీరు గురించి వివరించనున్నారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాల కల్పనలో సర్పంచుల బాధ్యతలను గుర్తు చేయనున్నారు.
అలాగే, అంగన్వాడీ కేంద్రాల అనుసంధానం, పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకం అమలు తీరుపై కూడా శిక్షణ ఉంటుంది. బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో నిర్వహించే 'బడిబాట' కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని విద్యాశాఖ కోరుతోంది.











