నిజామాబాద్ జిల్లాలో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా పలు ఆలయ చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది. నిందితులను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు తరలించింది.
నిజామాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మూడో టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. నిందితుల్లో రింకూ సింగ్, రవి సింగ్, అమన్‌దీప్ సింగ్ అలియాస్ కాలా ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం, హార్వెస్టర్ యంత్రాల పనుల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన నిందితులు, రాత్రి సమయంలో ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు చోరీ కేసుల్లో వీరి ప్రమేయం బయటపడింది. వీరిపై నిజామాబాద్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.
నిందితులపై నిజామాబాద్ మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, ఆర్మూర్ ప్రాంతంలో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని సీఐ శ్రీనివాస్ రాజ్ అభినందించారు.
నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ చోరీల ద్వారా ఎంత మొత్తంలో సొత్తును అపహరించారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ముఠా ఇతర జిల్లాల్లో లేదా రాష్ట్రాల్లో కూడా చోరీలకు పాల్పడిందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.











