కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. కిలో ప్లాస్టిక్ సేకరించి అందజేసిన వారికి టిఫిన్ బాక్స్‌లను బహుమతిగా అందించే విధానం ప్రజల్లో మంచి స్పందన తెచ్చిపెడుతోందని ఆయన తెలిపారు.
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలు పెద్దఎత్తున ప్లాస్టిక్ సేకరణలో పాల్గొంటున్నారని, ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోకుండా, పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలా గ్రామ స్థాయిలో తీసుకుంటున్న చర్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులను కలెక్టర్ అభినందించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు అన్ని గ్రామాల్లోనూ చేపట్టి, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అంతేకాకుండా, వేసవి దృష్ట్యా అన్ని గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డి.ఎల్.పి.ఓ., ఎంపీడీవో, ఎమ్మార్వో, హౌసింగ్ డిఈ, ఎంఈఓ, వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.












