నిజామాబాద్, జూలై 15
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ధర్పల్లి పులి హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. సీసీఎస్ పోలీసులు చేపట్టిన విచారణలో కమ్మర్పల్లి–బింగల్ అటవీ ప్రాంతంలో చిరుతను వేటాడిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసుల్లోనూ వన్యప్రాణుల అవయవాల అక్రమ వ్యాపారం కోణం కనిపిస్తోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ధర్పల్లి పులి హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్లు సమాచారం. పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు గోప్యంగా చేపట్టిన విచారణలో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇదే దర్యాప్తులో భాగంగా కమ్మర్పల్లి–బింగల్ అటవీ ప్రాంతంలో చిరుతను వేటాడిన ఘటన కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ధర్పల్లి అటవీ ప్రాంతంలో పులిని విద్యుత్ ప్రవాహంతో చంపిన అనంతరం దాని చర్మం, గోర్లు, దంతాలను తొలగించి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని దహనం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచ్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అదే దర్యాప్తులో కమ్మర్పల్లి–బింగల్ అటవీ ప్రాంతంలో చిరుత హత్య జరిగిన విషయం కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గొర్రెలపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో విషం కలిపిన గొర్రె మాంసాన్ని అడవిలో వేయగా, దానిని తిన్న చిరుత మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం దాని చర్మం, గోర్లు, దంతాలను సేకరించి అక్రమంగా విక్రయించేందుకు యత్నించినట్లు సమాచారం.
వన్యప్రాణుల చర్మం, గోర్లు, దంతాల విక్రయానికి తొలుత రూ.4 లక్షలకు బేరం కుదిరినట్లు సమాచారం. అనంతరం మరో వ్యక్తి రూ.4.50 లక్షలు ఇస్తానని ముందుకు రావడంతో మొదటి ఒప్పందాన్ని మార్చేందుకు నిందితులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో తొలుత బేరం మాట్లాడిన వ్యక్తులే పోలీసులకు సమాచారం అందించగా, మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు నిందితుల కదలికలపై గోప్యంగా నిఘా పెట్టి సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఒక కేసు దర్యాప్తులోనే మరో వన్యప్రాణి హత్య కేసు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అనంతరం కేసును తదుపరి చర్యల కోసం అటవీశాఖకు అప్పగించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మహేశ్ బట్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు ధర్పల్లి–దుబ్బాక అటవీ ప్రాంతంలోని పాడుబడిన బావిలో వన్యప్రాణి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి గోర్లు, దంతాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.












