పోలియో రహిత సమాజ స్థాపన లక్ష్యంతో కామారెడ్డి జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలు, మొబైల్ వైద్య బృందాల సేవలను వినియోగించుకొని అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ తెలిపారు. ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
చిన్నారుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్న కలెక్టర్, జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










