ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట మహా ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ వంటి పలు డిమాండ్లను జేఏసీ ముందుకు తెచ్చింది.
ఆర్టీసీ జేఏసీ నాయకత్వం, మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేసిందని పేర్కొంది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని, ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరింది.
కార్మిక సంఘాలను పునరుద్ధరించి, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కూడా జేఏసీ డిమాండ్ చేసింది. తమ సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. ఈ ధర్నాలలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ డిమాండ్లకు మద్దతు తెలపాలని కోరింది.











