సంగారెడ్డి జిల్లాలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం (RBSK) మరియు టీవీవీపీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 26న జిల్లాలోని పలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య బృందాలు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా సదాశివపేట, సంగారెడ్డి, కల్హేర్, నాగల్ గిద్ద, పటాన్చెరు, ఇస్నాపూర్, అల్గోల్, రాయికోడ్, అందోల్ ప్రాంతాల్లోని పాఠశాలలు ఉన్నాయి.
ఈ శిబిరాల్లో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి, చెవి, దంత సంబంధిత సమస్యలు, పోషకాహార లోపాలను గుర్తించి తక్షణ చికిత్స అందించడంతో పాటు, అవసరమైతే ఉన్నత వైద్య సేవలకు రిఫర్ చేస్తారు. విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంపై కూడా దృష్టి సారిస్తారు.
అదనంగా, మార్చి 26న సంగారెడ్డి పట్టణంలోని మార్కెస్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. నిపుణులైన వైద్యులు వివిధ వ్యాధులపై పరీక్షలు నిర్వహించి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారు.








