బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పలు కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించాలని ఆయన కోరారు.
ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, నిధులు విడుదల చేయాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు.
ఇంకా, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలపాలని, ఖాజీపేటలో రైల్వే మానిఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) నెలకొల్పాలని, గిరిజన విశ్వవిద్యాలయానికి మరిన్ని నిధులు కేటాయించాలని, మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని, భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) రైల్వేస్టేషన్ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ సూచించారు. రాష్ట్రంలో మిగిలిన 17 జిల్లాలకు జవహర్ నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని, రెండు సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని, జనగణనతో పాటు కులగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వద్దిరాజు రవిచంద్ర ప్రధానిని కోరారు.









