రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అమలుకు కార్యాచరణ విడుదల చేసిందని, జూన్ 15 నుంచి 24 వరకు సిబ్బంది, అధికారులకు శిక్షణ, ఫారాల ముద్రణ వంటి ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ ఫారాలు అందజేసి, తిరిగి సేకరిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుంది.
జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపట్టి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, దివ్యాంగ ఓటర్ల నమోదుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.












