రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెలే, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా మీ పార్టీకి రాదని హరీశ్ రావు జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే తమను అరెస్టు చేశారని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి పాలనను 'గడీల పాలన', 'బేడీల పాలన', 'గుడ్డి పాలన' అంటూ హరీశ్ రావు అభివర్ణించారు. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టాలని ప్రభుత్వాన్ని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కుంటున్నారని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
మీ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ పాలన అని రేవంత్ పరిపాలనను ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా? అని ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రశ్నించారు. పరిగిలో భూములను లాక్కొని తన సోదరుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు.
6 గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి, 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుందని ఈ సందర్భంగా హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. పరిగిలో రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న హరీశ్ రావుతో పాటు ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.











