తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి 'ఘోరమైన గులాంగిరి' చేస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక ఏటీఎంలా మారిందని ఆమె ఆరోపించారు. బుధవారం తెలంగాణ జాగృతిలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నిలబడే మాట్లాడారని, తన కుర్చీకి ఎసరు వస్తుందేమోనని భయపడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు.
ఏప్రిల్ 25 తెలంగాణ భవిష్యత్తు, చరిత్రను మార్చే రోజు అవుతుందని కవిత ఉద్ఘాటించారు. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని, పోరాడుతామని, పరిష్కరిస్తామని తెలిపారు. సామాన్యులతో, సామాన్యుల కోసం, సామాన్యులే ఉండేలా రాజకీయం తెస్తామని ఆమె మాటిచ్చారు.
రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని కవిత ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేదెవరు అంటే ప్రతినోట జాగృతే అనే మాట వస్తోందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ హై కమాండ్ని పైసలు అడిగితే రేవంత్‌రెడ్డికి 'నో రాహుల్ జీ' అని సమాధానం వస్తోందని, కానీ కేరళ ఎన్నికల కోసం ఎంత ఖర్చయినా పెడుతున్నారని విమర్శించారు.
అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని కవిత నిలదీశారు. జాతీయ హోదా వల్ల తుంగభద్రకు నీళ్లు రాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నష్టపోతుందని, అయినప్పటికీ ఈ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను, బీజేపీని సంతృప్తిపరుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందని భరోసా కల్పించారు. అంతర్జాతీయ నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నానని, కొత్త తరహా రాజకీయాలు, ప్రజలకు మంచి చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామని కవిత పేర్కొన్నారు.











