తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా, పార్టీ క్యాడర్ తో మూడు రోజుల పాటు సమాలోచనలు జరుపనున్నారు. ఈ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్న కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలతో నేరుగా సంభాషించి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఈ సమాలోచనలు ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించబడతాయి.
పార్టీ ప్రణాళికలో భాగంగా, వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, రాష్ట్ర స్వావలంబన కోసం ఒక బ్లూ ప్రింట్ ను రూపొందించడానికి ఇప్పటికే 50 కమిటీలు అధ్యయనం చేశాయి. ఇప్పుడు ఈ అధ్యయనాల ఆధారంగా క్యాడర్ నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడంపై కవిత దృష్టి సారించారు.
జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సమావేశాలు బుధవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయి.
బుధవారం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో, గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వారితో, శుక్రవారం నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రతినిధులతో సమావేశాలు జరుగుతాయని తెలిపారు.











