కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి డా.సత్యం శ్రీరంగం తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేతాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కూకట్‌పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు ముఖ్యమంత్రిపై ఉపయోగించిన పదజాలాన్ని డా.సత్యం శ్రీరంగం తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే హద్దులు దాటి మాట్లాడుతున్నారని, ఆయన పిచ్చి కూతలు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని ఆయన అన్నారు.
మైక్ దొరికిందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని డా.సత్యం శ్రీరంగం సూచించారు. ఎమ్మెల్యే కృష్ణారావు తన హయాంలో జరిగిన 90 శాతం అభివృద్ధి పనులపై శ్వేతాపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని డా.సత్యం శ్రీరంగం తెలిపారు. పరిపాలన సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల అభివృద్ధి కాదని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, కాంగ్రెస్ పార్టీ నిబద్ధత అని ఆయన పేర్కొన్నారు.











