తెలంగాణలో కేసీఆర్ పాలనలో పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఒడిపోదని, తమ మామ ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి హరీశ్‌రావు కలలు కన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రోజుకో ఎపిసోడ్‌తో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి, బదనాం చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కు ముందు ఫ్రూట్ మార్కెట్ కోసం కోహెడలో 178 ఎకరాలను కాంగ్రెస్ ఇచ్చిందని, కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఫ్రూట్ మార్కెట్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్‌లను బెదిరించి రాత్రికి రాత్రి చీకటి జీవోలు తెచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు కూడా ముఖ్యమంత్రి కావచ్చని, అది ప్రజల తీర్పుతోనే జరుగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోను తన సోషల్ మీడియాలో విడుదల చేసి, ఎంతమంది లైక్‌లు కొడతారో చూద్దామని ఆయన సవాల్ విసిరారు.
70 శాతం హామీలను అమలు చేయని బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌ను బదనాం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. 2014లో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ దరిద్ర పాలనపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య ఎక్కడ పోయిందని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని, రెండోసారి ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొక్కారని ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత బంధు అని చెప్పి హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన స్క్రిప్టునే బీ టీం బండి సంజయ్ చదువుతున్నారని విమర్శించారు.











