*నాలుగేళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరిట రేషన్ పంపిణీ – పాల్వంచలో వివాదాస్పద ఘటన*
కామారెడ్డి జిల్లా, పాల్వంచ:
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న రేషన్ పథకం నిజంగా అర్హులకు చేరుతున్నదా? లేదా కొన్ని ముఠాలు మృతుల పేర్లను వాడుతూ రేషన్‌ను దుర్వినియోగం చేస్తున్నాయా? ఈ ప్రశ్నలకు కళ్లెర వేసేలా ఓ సంచలన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో వెలుగు చూసింది.
ఆరేపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య అనే వృద్ధుడు 2021 సంవత్సరంలో మృతి చెందారు. అయితే ఆయన మరణించినా కూడా ఆయన పేరు రేషన్ కార్డులో కొనసాగుతూ, నాలుగేళ్లుగా ప్రతి నెలా రేషన్ సరఫరా జరుగుతోందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరణించిన వ్యక్తి పేరు మీద బియ్యం తీసుకోవడమంటే.. ఒక వైపు అర్హులైన పేదలు రేషన్ పొందక నష్టపోతుంటే, మరోవైపు మృతుల పేర్లను వాడుతూ కొంతమంది అనర్హులు ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితురాలి ఆవేదన
ఈ ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన జమున అనే మహిళ విలేకరులతో మాట్లాడుతూ – “2021లో మా మామ పెంటయ్య చనిపోయారు. ఆయన మృతి గురించి గ్రామంలో అందరికీ తెలుసు అని , సంబంధిత ఆధారాలతో పాటు మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా ఇచ్చామని చెప్పారు. అయినా రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించకుండా ఆయన పేరిట రేషన్ బియ్యం తీసుకుంటున్నాడు మా మరిది భూమయ్య. అతను తన మొబైల్‌కి వచ్చే ఓటీపీ ద్వారా ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నాడని మేము గుర్తించాం,” అని వివరించారు.
జమున చెబుతున్న వివరాల ప్రకారం, కుటుంబంలో చిచ్చు రేగిన నేపథ్యంలో ఆమె ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. “ఇది కేవలం మా కుటుంబ విషయమే కాదు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే. మృతుల పేర్లను వాడుతూ తప్పుడు రేషన్ పంపిణీ జరగడం అన్యాయం,” అని ఆమె తీవ్రంగా విమర్శించారు.
అధికారుల స్పందన..!
ఈ ఆరోపణలపై స్పందించిన పాల్వంచ తహశీల్దార్ మాట్లాడుతూ, “ఇది ఒక తీవ్రమైన అంశం. మృతుల పేర్లను వాడుతూ ఎవరైనా రేషన్ పొందుతున్నట్లయితే అది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన. తగిన ఆధారాలతో సంబంధిత వివరాలను మా దృష్టికి తీసుకొచ్చారు. మేము దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. సంబంధిత , రేషన్ షాప్ డీలర్లతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బందిని విచారించనున్నాం,” అని తెలిపారు.
అలాగే ఈ ఘటన వెనుక ఎలాంటి బాగోతం ఉన్నదా? మరణించిన వ్యక్తి పేరును తొలగించకుండా ఎలా కొనసాగించగలిగారు? గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది సంబంధిత సమాచారం ఆధారంగా చర్యలు తీసుకున్నారా లేదా? అన్న ప్రశ్నలు ప్రజల్లో పుట్టుకొస్తున్నాయి.
రేషన్ విధానంలో గోతులు?
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ పంపిణీ వ్యవస్థపై అనేక అనుమానాలను జనాల్లో కలిగిస్తోంది. ప్రతి మృతుడి సమాచారాన్ని నిబంధనల ప్రకారం మంజూరు చేసిన ఆధారాలతో సంబంధిత శాఖలు అప్‌డేట్ చేయాలి. అయితే అలా జరగకపోవడం వల్ల అనర్హులు పథకాలను దుర్వినియోగం చేసుకుంటున్నారన్న వాస్తవం తాజాగా మరోసారి రుజువైంది.
రేషన్ పంపిణీలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ విధానం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో మొబైల్ ఓటీపీ ద్వారా ధృవీకరించడం వల్ల భద్రత లోపాలు తలెత్తే అవకాశాలున్నాయనేది నిపుణుల అభిప్రాయం. ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చకపోతే, ఇలాంటి దుర్వినియోగాలు ఇకపై మరిన్ని చోటుచేసుకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రజాప్రతినిధుల స్పందన లేదెందుకు?
పాల్వంచ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన లేకపోవడం గమనార్హం. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ వ్యవస్థను బాధ్యతగా చూసుకోవాల్సిన నాయకులు ఇలాంటి అవకతవకలపై స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అవినీతిపై ప్రభుత్వానికి సవాల్
రేషన్ కేటాయింపుల్లో ఉన్న గోతులు ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సవాల్. పేద ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను ముఠాలు, కుటుంబ రాజకీయాల కోసం వాడుకుంటున్నా తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ ఘటనపై చర్యలు తీసుకుని, మృతుల పేర్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలి. గ్రామ వాలంటీర్లు, ఫెయిర్ షాప్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించకపోతే, మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది.
సంఘటనపై నిష్పక్షపాత విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.