వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ పర్యటన
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్,
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 29:
కామారెడ్డి జిల్లాలో వరదల ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల కారణంగా రహదారులు, చెరువులు దెబ్బతిన్న నేపథ్యంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియాల్ చెరువు వద్ద జాతీయ రహదారి–44 దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోవడం గమనించిన ఎస్పీ, అక్కడికి చేరుకుని నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడారు. వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
నిజాంసాగర్ పరిధిలోని బొగ్గుగుడిశా–బాన్సువాడ, బొగ్గుగుడిశా–నిజాంసాగర్ రహదారులను పరిశీలించిన ఎస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా చిన్న పూల్ బ్రిడ్జ్ వద్ద ఏర్పడిన పరిస్థితిని కూడా ప్రత్యక్షంగా గమనించారు. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.
తదుపరి ఆయన నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి భవనం పాక్షికంగా దెబ్బతిన్నదని గుర్తించారు. పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లింగంపల్లి గ్రామానికి చెందిన 78 మందిని గోర్గల్ పునరావాస కేంద్రానికి తరలించగా, ఎస్పీ వారిని పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. “ఈ కష్టకాలంలో పోలీసుల సేవలతో ఎన్నో ప్రాణాలు రక్షించబడ్డాయి” అంటూ ప్రజలు ఎస్పీని ప్రశంసించారు.
ఇక తడి హిప్పర్గా, చిన్న టాక్లి, పెద్ద టాక్లి, సిర్పూర్, లింబూర్ గ్రామాల నుంచి 250 మందిని మద్నూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి, మరికొందరిని డోంగ్లి పాఠశాలలోని కేంద్రానికి తరలించారు. ఈ రెండు కేంద్రాలను ఎస్పీ స్వయంగా సందర్శించి బాధితులతో ముచ్చటించి పండ్లు అందజేశారు. మద్నూర్ పోలీసుల సేవలను ఆయన అభినందించారు.
ప్రజలకు ఎస్పీ సూచనలు,
వరద ప్రభావిత రహదారులపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలి.
రహదారి అంచులు, బ్రిడ్జ్‌లు లేదా ప్రవహిస్తున్న నీటి వద్దకు వెళ్లకూడదు.
అధికారుల సూచనలు పాటించి, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తుందని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08468-220069 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు.