హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను 2-0తో ఓడించి విజేతగా నిలిచింది. ఈ పోటీలు మార్చి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.
ఈ క్వాలిఫైయింగ్ ఈవెంట్లో భారత్‌తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ దేశాల జట్లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. చివరికి, ఇంగ్లాండ్ జట్టు 2-0 తేడాతో భారత్‌పై విజయం సాధించి క్వాలిఫైయర్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత ఇంగ్లాండ్ జట్టుకు మంత్రులు బహుమతులు అందజేసి అభినందించారు. రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు కూడా అభినందనలు తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించడం, ముఖ్యంగా గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదుగుతున్న తరుణంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని మంత్రులు పేర్కొన్నారు. టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన హాకీ ఇండియా ప్రతినిధులను మంత్రులు సన్మానించారు.







