తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ చైర్మన్ చందా లింగయ్య దొర గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల పరిరక్షణపై చర్చించారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చందా లింగయ్య దొర కవితకు వివరించారు. జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక మత కాలమ్ ఏర్పాటు చేయాలని, ఆదివాసీల భాష ‘కోయతూర్’ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని వారు ప్రధానంగా కోరారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన ఆదివాసీలకు సరైన పునరావాసం కల్పించడంలో కేంద్రం విఫలమైందని, పెసా చట్టానికి, రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్ల రక్షణలకు విఘాతం కలిగిస్తోందని చందా లింగయ్య దొర ఆరోపించారు. దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని, గుర్తింపును కేంద్రం అవమానిస్తోందని ఆయన అన్నారు.
ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా తెలిపారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు ఆదివాసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు భారతీయ సంస్కృతికి ప్రతినిధులని, వారి గౌరవాన్ని కాపాడేలా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని చందా లింగయ్య దొర తెలిపారు. జనగణనలో తమది ఆదివాసీ మతమని సగర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.











