జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఉద్బోధించారు.
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన చూపిన మార్గం సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి, సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
విద్య ద్వారా మాత్రమే సామాజిక, ఆర్థిక పురోగతి సాధ్యమని, యువత అంబేద్కర్ బాటలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఆర్టికల్స్ పై ఆయన సమగ్రంగా వివరిస్తూ, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఆర్టికల్ దేశ ప్రజల హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని పరిరక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సమానత్వం ఆధారిత దేశంగా ఎదిగిందని కొనియాడుతూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని, రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని అందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ NV గిరి, తహసీల్దార్ హిమభిండు, మున్సిపల్ ఛైర్పర్శన్ ఉమారాణి, వివిధ శాఖల అధికారులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.












