జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో పిచ్చి కుక్కల దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందగా, సుమారు 25 గొర్రెలకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. బాధితులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు.
గొర్రెల కాపరులైన తోటకూరి చినచంద్రయ్య, రాసాల బిక్షపతి తమ పశువులను మంగళవారం రాత్రి షెడ్డులో కట్టేసి వెళ్ళగా, అర్ధరాత్రి సమయంలో పిచ్చి కుక్కలు మందపై దాడి చేశాయి.
ఈ దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందగా, మరో నాలుగు గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 20 గొర్రెలకు గాయాలయ్యాయని బాధితులు తెలిపారు.
ఈ ఘటనతో సుమారు నాలుగు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పశువులను కుక్కల బెడద నుండి రక్షించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.







