జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ఎస్పీ పలు కీలక అంశాలపై సమీక్షించారు. బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ ఇతర విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు 9 చెక్‌పోస్టులను పటిష్టంగా నిర్వహిస్తున్నామని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా అధికారులు, సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ శాఖ తరపున అన్ని భద్రతా ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రవాణా వాహనాల లభ్యతకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని తెలంగాణలో విక్రయించకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలియజేశారు.
పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతలను, రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.












