కామారెడ్డి జిల్లా కేంద్రంలో జల సాధన సమితి ఆధ్వర్యంలో గోదావరి జలాలను కామారెడ్డికి తరలించాలనే డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 20, 21, 22 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు నిలిచిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే పనులు ప్రారంభించాలని తీర్మానించారు. గత 20 ఏళ్లుగా గోదావరి నీళ్ల కోసం ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వక్తలు విమర్శించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాలలో జల సాధన సమితి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. 20, 21, 22 ప్యాకేజీలో భాగంగా 22వ ప్యాకేజీ పనులు సాగటం లేదని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని సమావేశం తీర్మానించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 21, 22 ప్యాకేజీలను మార్చినప్పటికీ, కెసిఆర్ ప్రభుత్వం నిధులు వెచ్చించకుండా తాత్సారం చేసిందని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలను మోసం చేస్తుందని పలువురు ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్ గోపాల్ మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో, నిధులు ఇవ్వకపోవడంతోనే ప్రాజెక్టు పనులు సాగడం లేదని, ఈ ప్రాజెక్టును 20వ ప్రాధాన్యతగా నిర్ణయించారని, ప్రజలు ఉద్యమిస్తేనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. కేవలం 2000 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు.
రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరున తెలంగాణ డబ్బును తన సొంత అవసరాలకు వాడుకుందని, తన ఫామ్ హౌస్ చుట్టుపక్కల భూములను కొనుగోలు చేసి ఆ ప్రాంతానికి కాలేశ్వరం నీళ్లు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత రైతులు మోసపోతున్నారని, దీనికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని, ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు.
ఈ సమావేశంలో హన్మండ్లు, అధ్యక్ష వర్గం కన్వీనర్ జగన్నాథం, కో కన్వీనర్ ఫిరంగి రాజేశ్వరి, కన్వీనర్ వెంకట్రామిరెడ్డి, సిపిఐఎం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా బిఎల్ఎఫ్ నాయకులు సిరిగాద సిద్ధరాములు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పీవీఎస్ఎన్ రాజు, కే శ్రీనివాస్, పి ఆంజయ్య, వెంకట లక్ష్మి, అనసూయ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. 22వ ప్యాకేజీని పూర్తి చేస్తేనే ఈ ప్రాంత రైతులు సుభిక్షంగా ఉంటారని వారు తెలిపారు.








