సంగారెడ్డి జిల్లాలో మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన పోష్ యాక్ట్ (POSH Act) ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రతి కార్యాలయంలో సురక్షితమైన వాతావరణం కల్పించడం యాజమాన్యాల బాధ్యత అని నొక్కి చెప్పారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, పనిచేసే చోట్ల మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరై, పోష్ యాక్ట్ మహిళల భద్రతకు, గౌరవానికి అత్యంత కీలకమైనదని తెలిపారు.
ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదు కమిటీ (ICC) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, మహిళల ఫిర్యాదులను గోప్యంగా, న్యాయబద్ధంగా పరిష్కరించాలని ఆయన సూచించారు. మహిళలు భయం వీడి, ధైర్యంగా తమ హక్కులను వినియోగించుకోవాలని, పోష్ యాక్ట్ అవగాహనతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
మహిళలు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న She-Box Portal సేవలను కూడా కలెక్టర్ వివరించారు. మహిళలు, బాలికల భద్రత, గౌరవం, సాధికారతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఆర్ డీఏ పీడీ జ్యోతి, డీఎం అండ్ హెచ్ వో వసంత్ రావు, తహసిల్దార్ జైరాం, ఎంపిడిఓ నిహారిక, సమన్వయకర్త పల్లవి, టౌన్ సీఐ, డీఎల్ఎస్ఏ అడ్వకేట్, సఖి సెంటర్ సిబ్బంది, డీసీపీవో, ఏపీఎంలు, ఏడబ్ల్యూటీలు, మహిళలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.








