గ్రామాల సర్వతో ముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతాయుతంగా పని చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు.
జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నాలుగు మండలాలకు చెందిన 4వ బ్యాచ్ నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో గ్రహించి, నేర్చుకున్న విషయాలను గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామానికి మంచి చేయాలన్న, ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా చట్టపరమైన నిబంధనల మేరకు అమలు చేయాలని తెలిపారు. గ్రామాలలో సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అందుబాటులో ఉన్న నిధులను సక్రమంగా వినియోగించడం వంటి అంశాలపై ఈ శిక్షణ ద్వారా స్పష్టత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించడం సర్పంచుల ప్రధాన బాధ్యత అని అన్నారు.
నిధులను సక్రమంగా వినియోగించి, ప్రాధాన్యత ఆధారంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మార్చి 31 లోగా పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
వేసవి కాలంలో నీటి సరఫరా సవ్యంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేయాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులకు సంబంధించిన మెటీరియల్తో కూడిన బ్యాగులను జిల్లా కలెక్టర్ సర్పంచులకు అందజేశారు.


