జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారం దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుండి ఐబీ వరకు నిర్వహించిన “జనగణన అవగాహన మారథాన్ వాక్” కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో జనగణన ప్రక్రియలో భాగంగా మే 10 వరకు స్వీయ గణన పూర్తయిందని, మే 11 నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశామని, ప్రజలు వారికి సహకరించాలని కోరారు.
జనగణనలో సేకరించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, సంక్షేమ పథకాల రూపకల్పన మరియు అమలులో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశ అభివృద్ధికి ఖచ్చితమైన గణాంకాలు ఎంతో అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి, జనగణన విజయవంతానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, ఆశా వర్కర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు.












