రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య, వివక్ష ధోరణికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ముందు ర్యాలీ నిర్వహించి, నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రెండేళ్లుగా జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని, బడ్జెట్ లో సంక్షేమానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం విఫలమైందని, పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.
చిన్న, మధ్య తరహా పత్రికలను అణచివేస్తున్నారని, అడ్వర్టైజ్మెంట్ బిల్లులు చెల్లించట్లేదని, ఎంపానల్మెంట్, అక్రెడిటేషన్లలో వివక్ష చూపుతున్నారని సోమయ్య ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, వైఖరి మారకపోతే రాష్ట్రవ్యాప్త చైతన్య యాత్ర చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసనకు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ మద్దతు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఐఅండ్ పీఆర్ డైరెక్టర్ కిషోర్ బాబుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.











