జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక స్థాయిలోనే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా, ప్రజావాణి దరఖాస్తులను ఇకపై ఆయా డివిజన్ కార్యాలయాల్లోనే సమర్పించాలని ఆయన సూచించారు. దీనివల్ల ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, జిల్లా పరిషత్ సీఈఓ చందర్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 105 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత డివిజన్ కార్యాలయాల్లోనే సమర్పించడం ద్వారా త్వరగా పరిష్కారం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.











