ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనకు, మౌలిక వసతుల ప్రణాళికలకు జనాభా గణన అత్యంత కీలకమని కామారెడ్డి అదనపు కలెక్టర్ మధుమోహన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చార్జ్ అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.
2027లో జరగనున్న జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశ ఇళ్ల జాబితా, గృహ గణన మే 11, 2026న ప్రారంభమై, రెండవ దశ జనాభా గణన ఫిబ్రవరి 2027లో జరుగుతుందని, మార్చి 1, 2027 ప్రామాణిక తేదీగా ఉంటుందని అదనపు కలెక్టర్ వివరించారు.
ఈసారి గణనను ఆధునిక సాంకేతికతతో డిజిటల్ విధానంలో, మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ల ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
గృహ గణనలో ఇంటి నిర్మాణం, సౌకర్యాలు, కుటుంబ వివరాలు, త్రాగునీరు, పారిశుధ్యం వంటి 33 అంశాలపై వివరాలు సేకరిస్తారని, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి సమాచారం నమోదు చేస్తారని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను సమర్థవంతంగా అమలు చేయాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని, ప్రతి వ్యక్తి గణనలో చేరేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి, పై అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించుకోవాలని సూచించారు. సెన్సస్ డైరెక్టరేట్ అధికారులు CMMS పోర్టల్ వినియోగం, హౌస్ లిస్టింగ్, స్వీయ గణన విధానాలపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జనాభా గణనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.








