మహబూబాబాద్ జిల్లాలో 2026-2028 సంవత్సరానికి గాను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్ స్నేహ శబరీష్ ఆదేశించారు. అర్హులైన జర్నలిస్టులకు మాత్రమే కార్డులు అందజేయాలని సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్, నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దరఖాస్తుల సంఖ్య, పరిశీలన విధానంపై డీపీఆర్ఓ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన నిజమైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణించాలని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం జిల్లాలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుంచి 447 ఆన్లైన్ దరఖాస్తులు అందాయని, వీటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారికి కార్డులు అందించాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, బాధ్యతాయుతంగా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని ఆమె సూచించారు. అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి దశలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, డీపీఆర్ఓ పి. రాజేంద్ర ప్రసాద్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











