పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యులు రాష్ట్ర మంత్రుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్చెరు మార్కెట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కమిటీ చైర్మన్గా శివానందం, వైస్ చైర్మన్గా రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు బిక్షపతి, మైపాల్, నాగరాజు, నర్సింలు, బాలరాజ్, ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, సతీష్ కుమార్ గౌడ్, ఇమ్రాన్, సునీత, హమీద్, సామయ్య, మల్లయ్య, గోపాల్ రెడ్డి కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ ఏర్పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.











